ఏది జరిగినా మన మేలుకే!
వెంకటాపురం గ్రామంలో అంజన్న , అమ్మాజీ అనే దంపతులు ఉండేవారు. వారికి లేక లేక కలిగిన కొడుకు వరప్రసాద్. తల్లిదండ్రుల గారాబం వలన వాడు అల్లరిగా తయారయ్యాడు.
విపరీతంగా కొడుకుని ముద్దు చేయడం వలన , మూర్ఖంగా తయారయ్యాడని వాడి ప్రవర్తన చూసి తల్లి తండ్రి భయపడటం ప్రారంభించారు.
‘ మొక్కై వంగనిది మానై వంగునా?” అన్నట్లు ,తల్లిదండ్రులు ఎన్ని బుద్ధులు చెప్పినా,వేటినీ ఒంట పట్టించుకోకుండా, అల్లరి చిల్లరిగా తిరగసాగాడు ప్రసాద్.
ఏదో పాడు పని చేయడం, ఎవర్నోఒకరిని బాధపెడుతూ ఉండడం, నోరువిప్పితే అబద్ధాలుచెప్పడం,
తనకన్నా బలహీనమైన వాటిని బాధపెడుతూ ఉండటం,
పసి పిల్లల్ని ,మూగజీవాలను హింసించడం అలవాటుగా మారింది . అందరూ తమకొడుకు పై నేరారోపణలుచేస్తూ ఉంటే చాలా బాధపడిన ప్రసాద్ తల్లి,తండ్రి, వాడి బుద్ధి,మార్చడానికి విశ్వ ప్రయత్నం చేసేవారు.
తల్లిదండ్రుల బలవంతం తో mukku tuu మూల్గుతూ,
స్కూల్ కి వెళ్లేవాడు ప్రసాదు.. రోజుకు ఒక గొడవ తెస్తూ ఉంటాడు. చేతులు ఎప్పుడూ ఖాళీగా ఊరుకోవు..
చేతిలో కర్రో, తాడో , పట్టుకుని చెట్లను, జంతువులను కొడుతూ ఉంటాడు.
ఎవరినో బాధపెట్టి వాళ్లు బాధపడుతుంటే చూసి
నవ్వుకుంటే గాని, వాడికి నిద్ర పట్టదు. చిన్న పిల్లల చేతిలో చిరుతిళ్లు లాక్కుని తినేయడం,
ప్రహరీ గోడ మీద కూర్చుని ప్రశాంతంగా నిద్రపోతున్న పిల్లుల తోక పట్టుకులాగడం,
ఇంటి ముందు విశ్రాంతి తీసుకుంటున్న కుక్కలను,
రాళ్లతో కొట్టడం, గుంపులుగా వచ్చి గింజలు తింటున్న పక్షులను చెదరగొట్టడం లాంటి పనులు చేస్తూ పక,పకా నవ్వుతాడు.
ఆరోజు అలాగే స్కూల్ నుండి వస్తూ, చేతికొందిన కొమ్మలు విరిచేస్తూ, చేతిలో గల సన్నని రువ్వతో . అందిన చెట్టు కొమ్మలని కొడుతూ,వస్తున్నాడు.
ఒక్క చెట్టుకొమ్మను కొట్టేసరికి ,ఆ కొమ్మకుపట్టిన కందిరీగలు పట్టు చెదిరిపోయి, కందిరీగలు వాడిని వెంబడించి కుట్టడం మొదలుపెట్టాయి .
వాడెంత తొందరగా పరిగెడుతూ ఉంటే, అవి ఇంకా వేగంతో వాడిని వెంబడించి కుట్టసాగాయి.
వాడు కేకలు అరుపులు విని, పొలంలో పనిచేస్తున్న రైతులు వచ్చి, వాడిని పొలంలో నీటి గుంతలోకి తోసి కాపాడారు. కందిరీగలు పోయిన తర్వాత, వాడిని తీసుకొచ్చి ఇంట్లో పడేశారు. ఒళ్లంతా కందిరీగలు ముళ్ళు విరిచాక,
కళ్ళు ,ఒళ్ళు వాచిపోయి, నెల రోజులు మంచం దిగలేక నరకయాతన పడ్డాడు ప్రసాద్.
తల్లి తండ్రి రాత్రి పగలు అనక మందులు పోస్తూ,రాస్తూ
సేవలు చేస్తూ, తేరుకునేలా చేశారు.
ముసలిదైన నాయనమ్మ, వాడిగాయాలకు మందు పూస్తూ,
ఏ జీవిని అకారణంగా హింసించ కూడదు.
ఎవరిని బాధ పెట్టినా, తప్పకుండా మనం ఏదో రోజు బాధపడి తీరుతాము అంటూ రోజూ నీతి కథలు చెప్పేది.
ఆ కథలు విని, వాళ్ల సేవలు చూసి, పరివర్తన చెందిన ప్రసాదులో మంచి మార్పు వచ్చింది.
అప్పటినుండి అల్లరి మాని బుద్ధిగాచదువుకుని,
వృద్ధిలోకి వచ్చాడు..
తల్లి తండ్రి నాయనమ్మ” ఏది జరిగినా మనమేలుకే “ అని సంతోషించారు.....
No comments:
Post a Comment