శివస్తుతి
హృదయ కుహరములోన నిదురించు శివుడా
చేతనము కలిగించి స్థిర చిత్తమీయు
ఈశ్వరుడు ఒక్కడే ఇహము పరమనుచూ
ధ్యానించు స్థితిలోకి జారనీ తండ్రీ
ప్రళయ కాలమైన పెనుముప్పు నాపు,
గరళకంఠుడ వేరు గతి లేదు స్వామి
వేదనతో జీవులు వడలిపోయేరు.
కారుణ్యమును చూపు కరుణాంతరంగా
మానవత్వం పోయి మృగతత్వమందు.
మనుజుల మనసులను సరిజేయు స్వామి
నీ లీలలెన్నంగ నేనెంత దాన.
నిశ్చలుడ నిటలాక్ష నీలకంఠుండ
అన్న పానములు లేక అల్లాడుచున్న.
అభాగ్యులకు దిక్కునీవుగాకెవరు ?
అన్న పూర్ణ ను గూడి ఆదుకొనరావా!
ఆపన్న రక్షక ఆనాధనాధ…
లయము చేసెదవనెడి పేరు నీకున్నగానీ
రక్షించు తండ్రివి నీవు గాకెవరు?
భక్తవ శంకరుడా భాగ్యాలరాశి.
అనుచు నీ విభూదికై ఆత్రమందేను
శుభములను నొసగేటి శ్రీ పార్వతిశ ,
స్థితిలయలన్నిటిని స్థిరముగా జేయు
అర్ధనారీశ్వరుడా అమ్మతో గుడి ,
ఆదుకొని బ్రోవుమాఅఖిల లోకములు
అమ్మ జెప్పగ నీవు అలనాడు విషము
లోకాలమేలును కోరి మ్రింగేవు
గరళ కంఠుడనీవు గంగను పట్టి ,
భూమిపైకి వదిలి క్షేమ మరసావు .
హర హర మహాదేవ అనగానే నీవు,
పరుగున వచ్చేవు పరమేశ స్వామి
శంభుడ సాంబుడ సర్వేశ నీవు.
సర్వావస్థలయందు సాకేవుస్వామి
ఆది దేవుడ వీవు అభయమ్ము లొసగె.
అన్ని జీవుల యొక్క మేలుకోరేవు
సామి నీ వాసము ఎచ్చోట నైన.
,సమయానికి వచ్చి ఆదుకుంటావు
అక్షర బిక్షను అవనిలో పంచి.
దక్షిణామూర్తి వై దరణి నిలిచావు
అమ్మ కడ బిక్షమును అందుకుని మాకు.
అందించి ఆది బిక్షువయ్యావు
సుఖమునకు సౌఖ్యముకు చింతించకుండ
చిదంబరుడవే నీవు వెలుగొందుతావు
ద్వాదశ లింగాల దర్శనము జేయ.
దయతోడ భక్తులకు మోక్షమిస్తావు
కుమార గణపతు లు కొడుకులుగ జేర.
అమ్మ పార్వతీ తోడ అలరించుతావు
ప్రమదగణములతోడ పరమేశ నీవు.
ప్రకృతిలో తిరుగుతూ పరవశిస్తావు
బోలా శంకరుడని భక్తితో గొల్వ.
పరమ సంతోషముతో వరములిస్తావు
ఏమని వర్ణింతు నీ మహిమ స్వామి.
ఎంతని పొగిడేది నీ శక్తి స్వామి
నీ అండ లేకుండా యీ జగములన్నీ.
ఏ తీరు నిలచురా ఏకాంబరేశా
కోటయినా పేటైన వల్లకాడైన.
ఒక్క తీరే నీకు ఓవిశ్వనాధ
లింగ నీవంట జంగమ దేవా,
లీలలు చూపించు నిశ్చల లింగ
పురిసెడు నీళ్లతో పుణ్యమునిచ్చి.
బ్రోచేటి స్వామి భక్త శంకరుడా!
పురుగైన పామైన పెద్ద గజమైనా
పుణ్యలోకములిచ్చుపాలనేత్రుండ
బోయైన కోయైన పెద్దరాజైన.
ప్రేమతో చూచేటి పార్వతీ రమణ
నమశ్శివాయ అనుచు నామమునుపలుక
నరక బాధలు తీర్చు నాదరూపుడవు
నీ మహిమ వర్ణింప నాకేది శక్తి
నీ దర్శనము పొందనాకేదియుక్తి?
శక్తియుక్తుల నొసగు శంకరుడనిన్ను
సర్వకాలముఅందు స్మరించుకుందు
అమ్మని అడిగి మాకు సౌభాగ్యమేయు
అయ్యవుగా మాకు సకు అఖిల సంపదలు
నీ బిడ్డలము మేము మమ్ముదయ చూసి
నీ పద సేవను మాకొసగు దేవ
అమ్మతో కూడి నాట్యమును చేసి
లోకాల కుల్లాసమీయుమో దేవ
అక్షరభిక్షను అయ్య మా కొసగి
అజ్ఞానమును మాలో తొలగింపజేయు
గణపతినిస్కందుని మాకు తోడిచి
గందరగోళాలు ఆపమను స్వామి
ప్రమాద గణములతోడ పార్వతి తోడ
పరమేశ దయచేసి పాపముల నాపు
శరణు శరణు నీకు శర్వాణి విబుడ
సన్నుతి చేసేను శాంతిని ఒసగు....
No comments:
Post a Comment