స్పూర్తి ప్రదాత
......................................
“ ఓరేయ్, రంగా జాగ్రత్త నాయనా!ఆచెట్టు పైకి పాములా పాకిరేస్తున్నావు.
జాగ్రత్త రా నాయనా!…
మీ అయ్య , కొబ్బరి కాయలు దింపడానికి వస్తాడనుకుంటే , నువ్వెందు కొచ్చావురా ?
అసలే నువ్వు చిన్నపిల్లాడివి.............. .
ఎలాగూ చెట్టుఎక్కిపోయావు గాబట్టి, ఈ ఒక్కచెట్టు నుండి నాలుగు కాయలూ దింపగలిగితే దింపేసి, జాగ్రత్తగా దిగిపోరా బాబూ . నిన్ను బతిమాలుతాను.
“కాళ్ళకు బంధమైనా వేసుకోకుండా, అంత పెద్ద కొబ్బరి చెట్టుపైకి
చాలా తొందరగా ప్రాకుతున్న, రంగడిని చూసి భయపడుతూ అన్నారు అన్నపూర్ణమ్మ".
రంగడు ఎంత తొందరగా ఎక్కాడో ,అంత తొందరగా బోండాలు తెంపి,
కింద పడేస్తూ ఉంటే,కంగారుపడుతూ మళ్ళీ అన్నారు .
దిగిపో.చాలు నాయనా!.....
వీలయినప్పుడే మీ అయ్యను రమ్మను.ఇప్పుడు దిగిపో .తొందరేమీ లేదు.. అరిచారు అన్నపూర్ణ మ్మగారు.
ఆమె కంగారు చూసి నవ్వుకున్నాడు రంగడు.. ….
చెట్టు దిగొచ్చి అన్నాడు . మా అయ్య ,మొన్న సంత కెల్లోచ్చింది మొదలు శానా తేడాగా ఉంటున్నాడమ్మా..
ఏమయిందంటే? చెప్పడు ...దిగాలుగా ఉన్నాడమ్మా…
.“ రంగా ।నేసచ్చిపోతే మీ యమ్మని బాగా సూసుకో ,
పెద్ద పంతులు గారి ఇల్లు మాత్రం ఎట్టిపరిస్థితిలో వదలకురా ,
అని అనేక అప్పగింతలెడతండు”.
భయమేస్తందమ్మా! ..
మా అమ్మకు సెప్పొద్దట.
టౌను డాక్టర్ దగ్గరి కెల్దామంటే ఇనడు .
అయినా ! నేనేమీ చిన్నోడిని గానమ్మా ..మీరు నేనింకా చిన్నపిల్లాడిననుకుంటారు మీరు . మా అయ్యకి పెద్ద కొడుకుని నేను .
నాకు పదిహేనేళ్ళు వచ్చాయి .మీ చిన్న మనుమడి తోటోడినని మీరేగా సెప్పినారు ?
చూడండమ్మా।నాకూ మీసాలు వచ్చేసాయి అని చెట్టు దిగొచ్చిచపడేసిన బొండాలన్నీ పోగుజేసి ,అన్నపూర్ణ మ్మతో మాట్లాడుతూనే
,ఆచెట్టున బోoడాలున్నాయని ఇంకొక చెట్టుపైకి ప్రాకిపోయాడు రంగడు .
.రంగా ,రంగా । అని అన్నపూర్నమ్మ గారు అరిచేలోగా,
ఇంకో చెట్టుపైకి ఉడతలా పాకి పోయాడు రంగడు.
రెండు చెట్ల కొబ్బరి కాయలూ దిoపాక చెట్టు దిగి తలపాగా దులుపుకుని
ఆ కాయలన్నీ పోగుచేసి ,పెరటి వసారాలో పెట్టాడు .
పశువులు తోలుకు పోవాలమ్మా ... నేనువెళతాను..
మా అయ్యని మీ కాడకు పంపుతాను .ఆడి బాదేటో మీరే కనుక్కుని కాస్తా మందలిoచడమ్మా...బెంగగా ఉంటున్నాడు ..
మీ మాటంటే మా అయ్యకు గురి. మీ మాట ఇంటాడు చెప్పండమ్మా..
అయినా! నేను బోడాలు దిoచిసి ఎల్లిపోతానేటి?
మీసేత్తో సేసిన ఆ కజ్జికాయలు నాలుగిస్తే ,కరకరా నములుకుంటూవెళ్లిపోతాను.
పశువులు తోలుకెల్లాల ఆలస్యం అయిపోతాది..అనిచెప్న్పూ
అన్న ప్పూర్ణమ్మ నవ్వు కుంటూ, కజ్జికాయలులిస్తే దండాలు పెడుతూ , గెంతుకుంటూ వెళ్ళిపోయాడు రంగడు ...
.వెర్రి నాగన్న. కజ్జికాయలు ఇస్తానంటే కాశీలో ఉన్న వస్తువునైనా తీసుకొచ్చి కాళ్లముందు పెడతాడు అనుకుంది. అన్నపూర్ణమ్మ ..
“అన్నపూర్ణ ఒకటో తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చనిపోయాడు ,
ఆమె బామ్మ ఆ పసిపిల్లను తన తమ్ముడి ఇంటికి తీసుకొచ్చింది .
అప్పటికే ఇద్దరుభార్యలు చనిపోయి ,ఇంట్లో ఆడదిక్కులేని తన తమ్ముడింట్లో చేరి తానే పెద్ద దిక్కయ్యింది..,తమ్ముడు ఇనాందారు అతని సిరి సంపదలు ,పరాయి వారి పాలవ్వకూడదని ఆమె నిశ్చయించుకుంది
నాలుగు పదులు నిండిన ఆ తమ్ముడిని ఈ ఆరేళ్ల పసిపిల్లలను పెళ్లి చేసుకోమంది.... ,ఆ పసిపిల్లతో నాకు పెళ్ళేంటి అక్కయ్యా?వద్దు అంటే ,
లోకంలో ఎందరు అలా చేసుకోవడం లేదు.?. నువ్వేమైనా ముసలాడివా మురగ వాడివా? రేపొద్దున్న నువ్వు ముసలివాడివైతే ఎవరు , నిన్ను చూసుకుంటారు?. నీ ఆస్తి చూసి అందరూ నీ పక్కన చేరినా , చివరి కాలంలో నిన్న అభిమానించి చేసిన వాళ్ళు ఎవరూ ఉండరు.. మరో 10 ఏళ్లకు పిల్ల పెద్దది అయిపోతుంది.. నువ్వు నిండు నూరేళ్లు బతుకుతావు.. నీ కడుపున పుట్టిన పిల్లలతో చల్లగా ఉంటావని ఆశలు రేకెత్తించిందిట ..
ఆ తమ్ముడు వద్దన్నా !,ఈ పసిపిల్లకు అతడితో పెళ్ళేంటని ?పిల్లతల్లి అత్తగారి దగ్గరగోలపెట్టినా వినలేదట .
"ఆడపిల్ల అరటి చెట్టు ఎంతకాలం ఎదగాలి?”.
నేను దాన్ని పెంచి పెద్ద చేస్తానని మకుపట్టుపట్టి , పట్టిన పట్టు విడవకుండా పెళ్లి ముహూర్తాలు పెట్టించిందిట.. ఈపెళ్లి చేసుకోనంటే నీ పెరటి నూతిలోనే పడి ప్రాణ త్యాగం చేస్తానని . నీనీ వయస్సు లో ఈపిల్లలను పోషించడానికి ఇంటింటికీ తిరగలేనని , ఈపిల్లల్నువదిలి ఉండలేనని బెదిరించిందట .
"మూడు పదులు నిండకుండానే భర్తను కోల్పోయి, ఆర్థిక పరిస్థితి బాగోలేక అత్త గారితో పాటు ఉంటున్నఆమె కోడలు వద్దని చెప్పినా ,
అత్తగారు కోడలు ,మాటవినక పోతే ఆమె ,మాట చెల్లక మౌనంగా ఉండిపోయిందిట.
తమ్ముడూ పేరుకు దీన్ని పెళ్ళి చేసుకో, .అది పెద్దయాక కాపురంచేద్దువని బలవంతంగాపెళ్ళి చేసిందిట బామ్మ . ఆర్ధికపస్థితులు ఆడపిల్లబ్రతుని అతలాకుతలం చేస్తాయి .
తాత వరసవానితో పెళ్లిఆ పసిపిల్ల అన్నపూర్ణకు తెలీదు ఆరేళ్ల పిల్ల పెళ్లి పీటల నుంచి ఆటలకు పరిగెడుతుంటే, అరిసెలు, చక్కిలాలు ఇచ్చి మరిపించి పెళ్లి చేసింది బామ్మ..
ఆ పిల్ల ఈ అన్నపూర్ణమ్మ..
ఇంటికి గురువుగారిని రప్పించి పురాణాలు, శాస్త్రాలు అన్ని నేర్పించాడు ఆమె భర్త .
“అన్నపూర్ణ ఆడుతూ పాడుతూ ఇంటికొచ్చిన గురువువద్ద
విద్యా భ్యాసం చేసింది .“పురాణ ఇతిహాసాలు పుక్కిట పట్టింది “.
అన్నపూర్ణకు పదహారేళ్ళకు కూతురు పుట్టింది .
ఆ అమ్మాయికి 14 ఏళ్లకే పెళ్లి చేసేసాడు తండ్రి..
కాకపోతే తన కూతురు కంటే మూడేళ్లు పెద్దవాడిని ఎంచి తెచ్చి ఏరి కోరి పెళ్లి చేసాడు.. .నలభై ఏళ్లకు అన్నపూర్ణ భర్త చనిపోయాడు .
అప్పటినుండి కూతురు అల్లుడు పిల్లలతో ధైర్యంగా జీవితాన్ని నెట్టుకొస్తోంది..
ఆకలన్నవారికి అన్నం పెట్టడం , రోగమన్నవారికి వైద్యం చేయడం ,మంచి చెడు చెపుతూ ఉండడం,మానవత్వంతో తల్లిలా అందరినీ ఆదుకోవడం,
తనమాటలు చేతలు ద్వారా,పెట్టుపోతల ద్వారా,
పేదవారికి .సహాయం చేయడం, వాళ్ల కష్టసుఖాలనన్నీ ఓపికగా విని ,
వాళ్లలో ఆత్మ విశ్వాసం కల్గించి ఆదుకోవడం, ఆమెనిత్యకృత్యాలు …
ఆమెది ఒక నియమబద్ధమైన జీవితం...అతను ఆమెమాటకాదనేవారు కాదు ఆయన దానశీలి .
60 ఏళ్ల అన్నపూర్ణమ్మ గారు, ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాల వారికి అమ్మే!
ఆమె అన్ని విధాలా అవసరంఅన్నవారిని అర్ధించేవారిని అదుకుంది ..
“ఆ మరుసటిరోజు సాయింత్రం తులసికోటదగ్గర కూర్చుని ఒత్తులు చేసుకుంటున్న అన్నపూర్ణమ్మగారు,అల్లంత దూరంలో నిలబడి ,దండాలమ్మా!
అన్న రాముడిని చూసారు .నువ్వా రాముడూ? దా అలా కూర్చో .... అదేంటి? ”నక్కులాంటి మనిషివి ,కుక్కిన పేనులా కూడుకుపోయున్నావు” ?
ఏమయిందిరా ? నీవిలా ఉంటే ,నీకొడుకు ,మీ ఆవిడబెంగ పెట్టుకుంటున్నారు.
నీ తల్లిలాంటి దాన్ని అంటావు కదా? ఎందుకలా ,దిగాలుగా ఉన్నావు?
నాతో చెప్పరా,నాయనా!ఏమయింది? ఆప్యాయంగా అన్నారు అన్నపూర్ణమ్మ.
రాముడు అలా ఆలోచిస్తూ అలా ఉండిపోయాడు . అన్నపూర్నమ్మగారు ఆశ్చర్యపోయారు . “రాముడుని అలా చూడడం
ఆవిడకు ఇదే మొదటిసారి” .రాముడు గజ ఈతగాడు .
పాతాళంళో పడిపోయిన వస్తువునైన పట్టుకొని పైకి నీటిపై తేలి పోతాడు .
పడుకు రాళ్ళను చేతి ముడుకుతో పగలగొడతాడు .
కర్ర గిర గిరాతిప్పి సాముజేస్తే, గ్రామంలో కొమ్ములు తిరిగిన మొనగాల్లైనా దుమ్ము కొట్టుకు పోయేలా చేస్తాడు ....చేతినిండా నువ్వులుపోసుకుని
గట్టిగా పిండి ,నూనెఅన్నంలో పోసుకుని పిప్పి ప్రక్కన పడేస్తాడు
.అంత బలవంతుడు..
పెద్ద పాచి చెట్ల పైకైనా పాములా పాకిరేస్తాడు .
మహా బలశాలి .మొండివాడు .
ఎవ్వరినీ ఖాతరు చెయ్యడు.
ఎవరినీ యాచిoచడు . కాకపొతే। చిన్నచిల్లర బుద్ధి, దొంగబుద్ధి వుంది
తమ దగ్గర ఎప్పుడు ఆ బుద్ధి ప్రదర్శించలేదు.
ఎవ్వరికీ భయపడడు గాని, తనన్నా ,తన అల్లుడన్నా, భయం భక్తీ . ఉన్నాయి.
తన అల్లుడు చెప్తేనే, ఊర్లలో పెద్ద గొడవలు జరుగుతుంటే ఆపడానికి
సాయం చేయడానికి వెళ్తాడు .
అతను వద్దంటే ,బాగా డబ్బిచ్చినా వెళ్ళడు. .
ఎందుకంటే।“ బుగత గారిoట్లో మనుమరాలి ఒకసారిఏమి పేరు గొలుసు దొంగలించాడని పోలీసులు తీసుకు పోతుంటే “ “ఆ గొలుసువాళ్ళ చాకలి సన్నమ్మ దొoగిలించిందని నిరూపించి ,రాముడికి శిక్ష లేకుండా చేసాడు తనల్లుడు . అప్పటినుండి తన అల్లుడంటే గొప్ప విశ్వాసం ఇతడికి .
. అతడేది చెప్తే అదే చేస్తాడు .ఆoజనేయునిలా అతని అడుగుజాడల్లో నడుస్తాడు .
ఆలోచిస్తున్న అన్నపూర్ణమ్మగారితో ,అమ్మా ! పెదబాబూ అమ్మ పిల్లలూ, ఎవరూ ఇంట్లో లేరుగా ! మెల్లగా గొంతు తగ్గించి అన్నాడు రాముడు .
లేరు, పెళ్ళికి ఊరెళ్ళారు . ఏమి పనుందా ? అన్నారు ఆమె .
అమ్మా ! అని ఏడుస్తూ ఆమె పాదాలపై పడిపోయాడు రాముడు.
నేను చెప్పిన మాట విను. నన్ను నాకుటుoబాన్ని కాపాడుతానని మాటియ్యు . ఈమాట నీ గుండెల్లోనే ఉండి పోతాదని మాటియ్యమ్మా!
నేనీ బరువు మోయ లేకున్నాను. బోరున ఏడ్చాడు రాముడు .
ఇదుగోరా !ఈతులసమ్మ మీద ఒట్టు. నీ భారం దింపుకో..
మనసు తేలిక పడుతుంది. .నాతో చెప్పు నాయనా....
,ఏం జరిగిందో చెప్పు . నాకు చేతనైన సహాయం చేస్తాను.
చిన్నపిల్లడివి. మీ కుటుంబాన్ని మాకు అప్పగించి మీ అయ్య చని పోయాడు . అన్నారు అన్నపూర్ణమ్మ గారు ఓదారుస్తూ...
కళ్ళు తుడుచుకొని మొదలుపెట్టాడు రాముడు .
“ఒక రోజు కామన్నదొర వలస బుగతగారు కబురుపెట్టారు.
తోటలో కొబ్బరి గెలలు దింపాలని . ఎల్లిదిoచానమ్మా .
ఆఖరిచెట్టు కాయలు దిoచదానికి చెట్టెక్కినప్పుడు
ప్రక్క తోటలో కొబ్బరి చెట్టుకి పండిపోయిన కొబ్బరి బొండాలు చూసానమ్మా…. ఇత్తనాల బొండాలు . అన్ని గెలలూ అలాగే ఏల్లాడుతున్నాయమ్మా ... నాలోని దొంగబుద్ది మళ్ళీ పడగెత్తిందమ్మా..
మూడు రోజులుపోయాక చీకటి పడ్డాక ఎల్లి మొత్తం గెలలు దిoపేసిరాత్రికి రాత్రి ఇల్లు చేర్చేసాను….. అదిజరిగిన నెలరోజులకు ఊరు తెల్లారక ముందుకొబ్బరిబొండాలు సంతకి తీసుకెళ్ళి అమ్మేసాను
,తెలతెలవారేసరికి తొలిబేరంగా సాలూరు షావుకారికి అమ్మేసి, ఆ నగదు తీసుకొని ఆ సాలూరుషావుకారి కొట్టుకి ప్రక్కనున్న బడ్డీ మీద కూర్చోని టిఫినీ చేస్తన్నానమ్మా…
అదుగో। అప్పుడే కామన్నదొరవలస బుగతగారు షావుకారి కొట్టకి వచ్చారు..
ఈ కొబ్బరి నీకు బొండాలు ఎవరు అమ్మారోయ్? అని అడిగారు .
ఆ షావుకారి . తెలీదుబాబూ . ఏ ఊరోడో తెలీదు . పొద్దున్నే వచ్చి అమ్మేసి ఎల్లిపోయాడు .
పoడినవి, కురిడీలకు, విత్తనాలకు మంచివని ఎక్కువ ధరకు కొన్నాను .
ఎందుకిలా ఆడిగారు బాబూ ? అన్నాడు షావుకారి .
“ నేను వెనకమారున కూచున్నానమ్మా 1 నన్నాల్లు చూడలేదు .
ఆల్లమాటలు నాకు ఇనబడతన్నాయి” .. చెవులు రిక్కించుకొని విన్నాను.
ఆ బుగత అన్నారు .. మా ప్రక్కతోటలో పండిపోయిన కొబ్బరిగెలలు,
ఆమధ్యన ఎవడో,రాత్రికి రాత్రి దింపుకు పోయాడు .అవి ఇవే…
నాకు కచ్చితంగా తెలుసు..
ఇప్పుడు వాడు దొంగతనంచేశాడని ఫిర్యాదుఇవ్వడానికి అడగలేదు.
వాడెవడో!“దొంగతనం చేస్తే చేసాడు గానీ , వా డింకా బ్రతికిఉన్నాడా?
అని నా అనుమానం.
ఎందుకoటే। ఆచెట్టు మీద పెద్దత్రాచుపాము తిరుగుతోంది .
ఎన్నాళ్ళనుండో ఆయింటివాళ్లు ఆ గెలలు దింపడం మానేశారు .
ఆ యింటపాములభయానికి వాళ్లు ఇళ్లువదిలి వెళ్లారు.
ఆ పాముని తప్పించుకొని వాడేలా ఆ కాయలుదిoపాడో ఆశ్చర్యం ?
పట్టపగలే ఎవరు ఆ చెట్టు ఎక్కడానికి సాహసించరు.. మరి వాడు అర్ధరాత్రి కి ఎలాగ ఆ పాము నుండి తప్పించుకున్నాడు అనేది నా అనుమానం?..
వాడు చనిపోతే ,వాడి తాలూకా వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ కాయలు నీకు అమ్మ కానికి ఇచ్చి ఉండాలి .లేదు నిజంగా ఆ దొంగ బతికుంటే, వాడు యముడిని గెలిచినవాడే !అన్నారమ్మా”….
ఆ మాటలు విన్ననాగుండె గూభే లు మందమ్మా...
అది మొదలు ఇలాగయిపోయినానమ్మా, అంటూ ఏడ్చాడు రాముడు .
పోన్లేరా ! నీకు ఆపాము నిన్నుఏమీ చేయలేదుగా ?ఇప్పుడు ఏడుపెందుకు ?
అన్నారు అన్నపూర్ణమ్మగారు .
" అదికాదమ్మా! ఆ రోజు బొండాలు దిoపుతున్నంతసేపూ, నా వీపు మీద
ఏదో గీకుతునే ఉందమ్మా. ఏ కొబ్బరి మట్టో, కాకి గూడులోని ముల్లో అనుకున్నాను అమ్మా.. కానీ! ఆ బుగత గారి మాటలు విన్నాక,
అదిపామనిఅర్థమైంది అమ్మా... అన్నాడు భోరున ఏడుస్తూ రాముడు ..
అంటే, ఏంటి రా? అర్థంగాక అయోమయంగా అన్నారు అన్నపూర్నమ్మ..
గొంగళి తీసి వీపుచూపెట్టాడు రాముడు.
నివ్వెరపోయింది అన్నపూర్ణమ్మ.
“ రాముడి వీపునిండా పాము గాట్ల మచ్చలు ..చూస్తూ గొంతు తడారి పోతుంటే
అన్నారు . ఏంటిరా ఇదంతా ? అని .
కంగారు అతనికి కనపడనీయకుండా సాధ్యమైనంత మైనంత ధైర్యం తెచ్చుకునిఅన్నపూర్ణమ్మ ఇంటీకెలా వచ్చావు వివరంగాచెప్పు అన్నారామె .
ఆ రోజు తెల్లారి, ఇంటికొచ్చాక నా వీపు చూసి , గోలపెట్టేసి నా ఇంటిది.
బలవంతం చేసి పంతులు బాబు దగ్గరకు మంత్రానికి తీసుకెల్లినాదమ్మా ... .
ఆబాబు ,ఏవో పూతల పూసి,,పసరు రాసి,గొప్ప మంత్రమేసినారు .
వారం రోజుల్లో బాగా తగ్గి పోయిందమ్మా..
ఆబాబు దుoప పసుపుతో కలిపి రాయమని పసరు ఇచ్చి ,పదిరోజులు రోజూ మంత్రం వేసేవారమ్మా .. పూర్తిగా తగ్గిపోయింది..
తగ్గిపోయాక నెల తర్వాత సంతకు వెళ్లాను అన్నాడు రాముడు..
నీ భయం ఏంటో నాకు అర్థం కావడం లేదు రా ?...
మరి అప్పుడు మానేసి ఇప్పుడు భయమెంటిరా ?
అసలు ఆరోజు అన్ని బొండాలు తీసుకుని ఇంటికి ఎలా వచ్చావు?
వీపునిండా గాట్లు చూస్తూ .గొంతు తడారి పోతుంటే అన్నారు అన్నపూర్నమ్మగారు . వీడు ఎలాంటి మనిషో? అనుకున్నారు మనసులో..
అదేగదమ్మా! నా బాధ.
అంతవరకూ నా ఈపుమీద కొబ్బరిమట్ట గాని ,కాకి గూట్లో ముళ్ళు గాని గీసింది అనుకున్నానమ్మా .. అప్పుడే వీపు మీద రక్తం కారుతున్న తుడిచేసుకున్నాను , ఇంకో ఆలోచన రాలేదు. కోడి కూసేవేళకి ఇంటికి చేరుకున్నాను.
దూరంగా బండి గడ్డితో పెట్టి గెలలు ఆ బండిలో పడేసి,
ఆ కాయలుతెచ్చి మా మిద్దె మీద దాచేసాను.
నెల రోజులు పోయాక, బొండాలమ్మిన రోజున, ఆరోజు బుగత మాటలిన్నాక ,
నా ఒంటి గీసింది తాచుపామని తెలిసిభయం మొదలైందమ్మా..
బయిటకు సెప్పలేక , లోపల దాచుకోలేక ,ఇంటి దానికి చెప్తే,ఇజ్జత్ పోతాదని,పిల్లాడికి తెలిస్తే పలుచన
అయిపోతానని,,పదిమందికి తెలిస్తే పరువు పోతుందని
,దొంగతనాలు మానేశానని అందరూ అనుకుంటున్న సమయంలో,
ఈ విషయం తెలిస్తే విలువ ఉండదని,
బయటకు చెప్పలేక,లోపల దాచుకోలేక,,సచ్చిపోతానని తెలిసి ,
చావు భయంతో సచ్చి పోతున్నానమ్మా అంటూమళ్లీ ఏడ్చాడు రాముడు .
అన్నపూర్ణమ్మకు అప్పుడు అర్ధమయింది . విన్నతర్వాత వాడికి మనోధైర్యం దెబ్బతిందని , రాముడికి ఇప్పుడు చెప్పాల్సింది ధైర్యమని, అతడికి కావలసిందిమానసిక స్థైర్యం అని తెలిసింది..
తనే ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని నిశ్చయించుకుందామె..
రాముడూ। నీకు నా మాటపై నమ్మకముందా? అన్నారు .
"అందుకే కదమ్మా ! మీ కాడి కొచ్చింది దీనంగా అన్నాడు రాముడు" .
అయితే పూర్తినమ్మకంతో విను . నిజంగా నిన్ను తాచుపామే కుట్టినట్లయితే,, ఆ విషం రక్తంలోకెక్కితే ఆరోజే పైకెక్కిన చెట్టుపై నుండి పడిపోయి చచ్చిపోయి ఉండే వాడివి.. అది చర్మం మీదే గీకినట్లున్నట్లయితే,విశం రక్తంలో కలియకుండా
మా రమణ పూసిన పసర్లతో అప్పుడే తగ్గిపోయింది. మచ్చలే ఉన్నవి.
“మా రమణ పేరుకి తగినట్లు రమణ మహర్షే”కాబట్టి, . వాడు మంత్రాన్ని ఉపాసనచేసి కూర్చున్నాడంటే , పాము ఏదో రూపంలో వచ్చి తన విషాన్ని,
తనే హరిస్తుంది . సాక్షాత్తు సశివుడే వాడి భక్తికిమెచ్చి ఆవిషం హరింపజేస్తాడు . అందరి నమ్మకము.ఆ రోజు వెంటనే నువ్వు మా రమణ దగ్గరకు వెళ్లబట్టి ,
నీ గండం గట్టెక్కి పోయింది ... ఒకటీ గుర్తుంచుకో ! ఆవగింజంత ఆయుర్ధాయం ఉంటే బీర గింజంత పిశాచం కూడా ఏమీ చేయలేదు .
" వాడి మంత్రంతో, ఆపసరుతో ,నీ ఒంట్లో విషo అప్పుడే విరిగి పోయింది “. ప్రాణాలు పోయాయనుకునే వారిని , పాము కాటుకి గురైన వారిని ,ఎందరినో నురగలు కక్కుతూ వచ్చిన వారిని ,‘మంత్రం వేసి మారమణ బ్రతికిoచడం
నువ్వు నీ కళ్ళతో చూసావు కదరా?’
ఆ చెట్టు పై పాముందని వినడంవల్లనే, బెంగతో మాత్రమే ఇలా అయిపోయావు .
వినకపోతే మామూలుగానే ఉండేవాడివి కదా?..
అసలు అక్కడ నిన్నుకుట్టిందిపాము కాదు.
నువ్వు అన్నట్లు ఏ ముల్లో గీసుంటాయి..
ఒకవేళ పాము కాటేసిన రమణ మంత్రంతో విషం అప్పుడే పోయింది .
అది విష యం.. నా కంటికివి ఇది ఏమాత్రం పాము కాట్లలా కనిపించడం లేదు!..
ఒకవేళ ఆ బుగత చెప్పింది నిజమైతే..... అవి పాము కాట్లయితే! ,
ఆ రోజు నువ్వు చెట్టు దిగి ఇంటి వరకూ రావు ..
ఆ కొబ్బరి బొండాలు అమ్మినవాడు చుట్టుపక్కల ఎక్కడో ఉంటాడని,
లేకపోతే ఈ షావుకారి వాడికి ఒక కబురు చెప్తాడు అని,
దొంగని పట్టుకుందామని ఆ బుగత అలా అని ఉంటాడు.
.అర్థమైందా?
ఇక నాకూ మంత్రాలువచ్చు,,వైద్యం వచ్చును కదా.?.
అయితే మా రమణ గాని నేను గాని, వేసే మంత్రాలు,,
మంచి వాళ్ల మీద ఇంకా బాగా పనిచేస్తాయి.
వాళ్లు తొందరగా కోలుకుంటారు..
తప్పుడు పనులు చేసిన వారికి ,అంత బాగా పనిచేయవు..
నీకు ఆ చిన్న తప్పుడు బుద్ధి ఉండబట్టే ఎన్నాళ్ళు ఇంత దుఃఖాన్ని భయాన్ని అనుభవించావు.
నీది కాని సొమ్ము ఎంత కష్టాన్ని తెచ్చి పెడుతుందో నీకు అర్థం అయిందా?
ఇకపై దొంగతనాలు చేయనని ఈ తులసమ్మ ముందు ప్రమాణం చెయ్యు.,
నేను మంత్రిoచి ఇచ్చిన విభూతి , నేనే ఇప్పుడు నీ ఒంటి మీద
రాస్తాను..
ఇదుగో !,ఇంటికి తీసుకెళ్ళి , నీభార్యను పవిత్రంగా దేముడిదగ్గరపెట్టి ప్రతీ రోజూ
ఉదయం సాయింత్రం అక్కడ పూయమను ..
నేనిచ్చిన విభూతి రాసుకుని ,నలభై రోజులు ఉదయం విష్ణు మూర్తికి ,
సాయింత్రం శివుడికి ప్రదక్షిణాలు చెయ్యు ..
మచ్చలు కూడా మాయమౌతాయి .
మృత్యువు నీదరికి చేరదు.. లేనిపోని అనుమానాలు పెట్టుకోకు..
“ అనుమానం పెనుభూతం” అంటారు పెద్దలు..
నీవు ఇంకా బెంగ పెట్టుకుంటే. నీ అనుమానమే నీకు ప్రమాదానికి దారితీస్తుంది.
నా మాట నమ్ము అని ధైర్యం చెప్పారు అన్నపూర్ణమ్మ.
“ దొంగ తనం చెయ్యనన్న మాట తప్పితే మరణమే సుమా” అన్నారు బెదిరిస్తూ అన్నపూర్ణమ్మ ...
“నాకు ధైర్య మిచ్చిన దేవత మీరు” .మీపాదాలపై ఆన.
నేనింక మంచిగా బ్రతుకుతానమ్మా…
అయినా, ఈబతుకు మీరుపెట్టిన బిక్షకదమ్మా.!
నేనుకడుపులోనే బాగా పెరిగిపోయి ,మా అమ్మకు ప్రసవంకష్టం అయిపోయిందట..,
ఇక తల్లి,పిల్ల ,బతకరని అందరూ ఆశలు వదులుకున్నారట.,
మా అయ్య మీ దగ్గరికి వచ్చి చెప్పుకుని ఏడిస్తే,
ఆ రోజు గాలి వానలో మీరు మా ఇంటికి వచ్చి,, పురిటి మంచంమీద కూర్చుని,
మీ బంగారం లాంటి చేతులతో అడ్డంగా తిరిగి నన్ను ,మామూలుగా తిప్పి సులభంగా ప్రసవం చేయించారట..
తల్లి పిల్లడు ఇద్దరి ప్రాణాలు కాపాడారుట..
అప్పటి నుండి నన్ను ఏదో ఒక విధంగా మీరు కాపాడుతూనే వస్తున్నారు..
అదేగాక నాకు విపరీతమైన ఆకలమ్మా, చిన్నప్పటినుండి..
మా అమ్మే నా ఆకలి భరించలేక మీ అరుగు మీద వదిలేస్తే,
మీరు ,చిన్నమ్మ గారే ,మీ ఇంట్లో పిల్లలకంటే నాకే ఎక్కువ తిండి పెట్టేవారు.నేను మరచి పోను .
నేను కాలం మీద ఉన్నప్పుడు కూడా ఎవరి కంటా పడకుండా,,
కుంభాలకు కుంభాలు తిండి పెట్టేరు. పోషించిన తల్లి మీరు..
మీ ఋణం ఈ జన్మకే కాదమ్మా!ఎన్ని జన్మలెత్తినా తీర్చలేను....
మా ఆడది ఇప్పటికీ చెప్పి నవ్వుతుందమ్మ..
“పెళ్లయిన కొత్తలో నీ తిండి నీ తీరవా చూసి నాకు భయమేసేది.”
. రాక్షసుడులా కనబడే వాడివి.. ఒకసారి ఆ మాటంటే పెద్దమ్మ గారు నన్ను దెబ్బలాడేరు.. మనిషి అలా కనబడతాడు గాని, ,వాడి మనసు చాలా మంచిదే!..
తిండి అంటావా? ,వాడు చేసిన పనికి సరిపడా తిండి తింటాడు.
వాడుచేసిన పని ఎవరూ చేయలేరు . అంత బలమైన పని చేయగలడు..
తిండి పుష్టి ,కండ పుష్టి కలవాడు. వాడికి నువ్వంటే ప్రాణం..
చక్కగా వండిపెట్టి,
వాడు సంపాదించిన దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుని, గుట్టుగా సంసారం చేసుకొని, సుఖంగా ఉండమని మీరు బుద్ధులు చెప్పారటకదమ్మా..
అది మొదలు ఎంతో చక్కగా ఉంటుందమ్మా..
నేనొక్కడినే కాదు.
నాలాంటి వాళ్ళు అందరూ, మీ పేరు చెప్పుకుంటూ ఉంటారు.
. నా కొడుకు ఇప్పటికీ మీ ఇల్లు వదలడు.
కారణం మీరందరూ చూపెడుతున్న మంచితనమే కదమ్మా?
పొట్ట పోషించుకోవడానికి మేము పనులు చేస్తూ ఉంటాం.
గానీ , మమ్మల్ని అభిమానించిన వాళ్ళకి, ప్రేమగా చూసుకునే వాళ్ళకి,
ఎక్కువ సేవ చేయాలనిపిస్తుందమ్మా..
అందుకే మిమ్మల్ని మీ ఇంటిని వదల్లేము..
ఇప్పుడంటే పై పనులకి కదా కుటుంబం కోసం వెళ్తున్నాను గాని,
ముందంతా మీరే కదా పోషించారు. ఏదైనా చిన్నప్పటిపట్టి ఇప్పటివరకు
నా బతుకు నిలబెడుతున్న ,మీరు చెప్పినట్లే బతుకుతాను,
అని రాముడు ఆమె పాదాలపై ప్రమాణం చేసి ,దండంపెట్టి, ఇంటికి వెళ్లాడు ఉత్సాహంగా....
" ధైర్యంగా వెళుతున్న రాముడిని చూసి , ,వాడిని చల్లగా కాపాడు తండ్రి
,అని భగవంతుడికి మొక్కుకున్నారు అన్నపూర్ణమ్మ". ..
తనలో తను అనుకున్నారు. “ ఎవ్వరికైనా మానసిక ధైర్యమే, మనుగడ నిచ్చి , మందులా పనిచేస్తుoదనుకున్నారు"
పెద్ద చదువులు చదవలేకపోయినా .
ఒద్దికగా జీవించి,జీవితాలను చదివిన మానసికవైద్యురాలు...
మానవతామూర్తి అన్నపూర్ణమ్మ. ...
ఎప్పటికీ ఎవరికి హాని చెయ్యకుండా, చేతనయినంతవరకు ప్రాణులను
కాపాడ గలిగేశక్తి నియ్యు స్వామీ, అని మహదానందంతో ఆ మహా శివునికి మ్రొక్కు కున్నారు సార్ధక నామధేయురాలు అన్నపూర్ణమ్మగారు.
స్త్రీ సాధికారత, స్వేచ్ఛ, సమానత్వాల కోసం పోరాడుతున్న ఈ ఆధునిక యుగంలో కూడా అన్నపూర్ణమ్మ లాంటి ఆత్మవిశ్వాసం గల అతివలు
ఆదర్శప్రాయులు, స్పూర్తి ప్రదాతలుగా నిలుస్తారు…
సమాప్తం
No comments:
Post a Comment