గంతకు తగ్గ బొంత.....
గొప్పల గోవిందరావును , అబద్ధాల అనుష సీతారాంపురంలో
శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవంలో కలిసింది. కళ్ళు మెరిసేటట్లున్న ఖరీదైన నగలతో, కాస్త ఎర్రగా బుర్రగా ఉన్న అనూష, అంతట తానై అన్నిట తానై అతి ఉత్సాహంతో తిరుగుతుంటే, ఆ తీర్థం జరగడానికి, తీర్థ ప్రసాదాలు పంచడానికి ప్రధాన కారణమైన తిరుణామాల రాజు గారి భార్యను అమ్మ అమ్మ అంటూ, అన్ని సేవలు చేస్తుంటే వారి సంతానం అనుకున్నాడు గోవిందరావు…
అందరూ తీర్థంలో స్వామిని చూస్తూ ఉంటే తను మాత్రం అనూషను చూస్తూ, హమ్మయ్య ఈ అమ్మాయి అన్ని విధాలా నచ్చింది. అబద్ధమో, సుబద్ధమో , తన ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పి, ఆ అమ్మాయిని ముగ్గులోకి దింపి, ప్రేమ పేరుతో పెళ్లికి ఒప్పించేలా చేయాలి. దాంతో తమ దరిద్రం దగ్ధం అయిపోతుంది అనుకున్నాడు గోవిందరాజులు.
వెంటనే టక్కు సరి చేసుకుని , టై సరిగ్గా సర్దుకుని, క్రాఫ్ దువ్వుకొని కొత్త పెళ్ళికొడుకులా తయారై, అమ్మగారికి ఆకు వక్కలు అందిస్తున్న అనుష్క పక్కన చేరాడు.
తనను ఆరాధనగా చూస్తున్న గోవిందరాజులను చూసి, కుర్రాడు గొప్పగా ఉన్నాడు, బాగా చదువుకున్నవాడిలా కనపడుతున్నాడు, తను ఎలాగైనా ఇతన్ని పెళ్లికి ఒప్పిస్తే, “కోటలో బాగా వేసినట్లే అనుకుంది”... మీరు మా డాడీకి తెలిసిన వాళ్ల్లా ? నేను మీకు ముందే తెలుసా? అంత పరిశీలనగా చూస్తున్నారు అంది వయ్యారంగా.. మెలికలు తిరిగిపోయిన గోవిందరాజులు, మేము పక్క ఊరి పర్వత రాజు గారి కనిష్ట పుత్రులం. మీ ఊరు తీర్థం చూడ్డానికి వచ్చాము మిమ్మల్ని కూడా చూసాము, సంతోష అన్నాడు. నాటక ఫక్కీలో .
ఓహో! మా మమ్మీ డాడీ మీకు ముందే తెలుసు అనుకున్నాను.
సరే. ఈ డ్రింక్ తాగండి అని అందించి, ఆ పెద్దావిడ చెవిలో ఏదో చెప్పి , పదండి అలా దూరంగా వెళ్లి మాట్లాడుకుందాం అంది.
అలా ఇద్దరూ చేరువై , ఆ ఊరి పొలిమేరలో కలుసుకుంటూ,
వాళ్లే జమీందారికి వారసులైనట్లు ఒకరికొకరు గొప్పలు చెప్పుకుంటూ చాలు మధ్యలో మన రెండు ఊర్లకు ఉన్న శత్రుత్వం వలన మన పెద్దవాళ్లు మన పెళ్లికొప్పుకోరు ఏ శ్రీరామనవమి నాడు కలిసామో!
ఆ శ్రీరామనవమినాడే పెళ్లి చేసుకుందామని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. హనీమూన్ కి అటు ఊటీ వెళదామా ?
ఇటు కూర్గ్ వెళదామా అనుకుని, అబ్బా అంత దూరం నేను ప్రయాణం చేయలేను , పరీక్షలకు చదువుకోవాలని గోవిందరాజులు గొప్పగా చెప్పడంతో అరకు వ్యాలీ వెళ్ళడానికి అన్నీ సర్దుకున్నారు.
అదిగో అప్పుడే ఎదురయ్యాడు ,, అనుమానాల ఆనందరావు..
అనుష్కను చూస్తూనే, నువ్వు సీతారాంపురం చిన్నజమిందార్ గారు ఇంట్లో పని పిల్లవు కదా? ఒరేయ్ అప్పుల అప్పారావు కొడకా?
మీ నాన్న చేసిన అప్పులకి తప్పించుకు తిరుగుతూ, డిగ్రీ కూడా కంప్లీట్ చేయకుండా దేశదిమ్మరి తిరుగుతూచివరికి ఈ పిల్లను పిల్లను పెళ్ళాడావా?అనేసరికి ఇద్దరికీ పట్టపగలు నక్షత్రాలు వినబడ్డాయి. నీ సూటు బూటు చూసి నువ్వు పెద్ద ఇంటి వాడివి అనుకున్నానని అనుష్క అంటే,
నీ నగలు వగలు చూసి మమ్మీ డాడీ అంటూ ఉంటే నువ్వు వాళ్ళ ముద్దుల కూతురు అనుకుని మోసపోయాను అని గోవిందరాజులు జవాబు ఇచ్చాడు…
నా అందానికి నాకు రాజు గారి మేనల్లుడు వచ్చి ఎగరేసుకు పోతాడు అనుకుంటే, ముష్టి రాచవారి ీ ముద్దుల బిడ్డ నువ్వు తగిలేవా? నా కర్మ అంటూ నుదురు కొట్టుకుంది అనుష్క.
మా తాత ముత్తాతలు పేరు ఉన్న జమిందార్ లే .. జమీందారీ వంశంలో ఉన్న అమ్మాయి జవహరీతో వస్తుందనుకుంటే,
నకిలీ నగలు పెట్టుకొని నాలుగిళ్లలో పాచి పని చేసే ఆగమ్మ కూతురివి నువ్వు వచ్చావ్? నా కర్మ అని నుదురు కొట్టుకున్నాడు గోవిందరాజు. “గంతకు తగ్గ బొంత” అలాగే మూడు ముళ్ళు పడిపోయాయి కాబట్టి ముచ్చటగా కాపురం చేసుకోండని సర్దిచెప్పి సంచి పట్టుకుని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు అనుమానాలఆనందరావు.
No comments:
Post a Comment