Friday 21 June 2019

అంకురం


కవితలు


            తొలకరి                                                                                                                                           తొలకరిలో  నాతలపు   తొంగి   చూసింది

  జ్ఞాపకపు  దొంతరలు  తిరగదోడింది

 భావనల  బంధాల బరువు  దింపింది

 క్రొత్త  చినుకులకు  సాహిత్య భూమి మురిసింది                                                                                                             

  తొలకరి  చినుకు పడి  తొడిమ మురిసింది                                                                                              తొడిమ మురిపముజూసి చినుకు నవ్వింది
 
 వాటిఆటలు  జూసి  వనము నవ్వింది

 తొలకరి జల్లులకు  తడిసి  పోయింది .
 


   

Sunday 10 February 2019

ఉత్తరాంధ్ర విశాలాక్షరి



అనుబంధాలన్నిటినీ అనురాగం తో నిలబెట్టుకుంటూనే అక్షర బంధాన్ని విడవకుండా నిలుపుకున్న, కుంటున్న  ఆత్మీయ బాంధవి విశాల. ఆలిగా , కోడలిగా,  అమ్మగా , కొత్తగా వచ్చిన మరో పదవి అమ్మమ్మగా బంధువులందరితో నూ ,  అన్నిటికి మించి ఉపాధ్యాయిని గా ఇన్ని పాత్రలు పోషిస్తోన్న విశాల ఓపికను చూసినప్పుడు ఆత్మీయతతో ఆర్ద్రమైపోతుంది మనసు. ఏనాటి బంధమో కానీ పరిచయమైన ఈ దశాబ్దం లో కష్టమైనా, సుఖమైనా ముందుగా నీతో చెప్పేసుకుంటే మనసు సేద తీరుతుంది రా తల్లీ అంటూ స్నేహలతలా అల్లుకుపోయిన విశాల ఈ బాల కడలి గా తన అక్షర ఫలాలని ఆవిష్కరించడం ఆనందంగా  అనిపిస్తోంది. ఆడపిల్లకు చదువెందుకు అన్న ఛాందసపు కంచెని పెద్దన్న సహాయం తో దాటి , పోస్ట్ గ్రేడ్యుయేట్ అయి, భర్త సహాయంతో తెలుగు ఉపాధ్యాయినిగా తన బాధ్యతలను అత్యంత  శ్రద్ధా భక్తులుతో నిర్వహించే మా విశాల మా ఉత్తరాంధ్ర మేటి కవయిత్రులలో ఒకరు అని చెప్పుకునేందుకు మా సాహిత్య కుటుంబమంతా గర్వంగా భావిస్తున్నాము. తన విద్యార్ధుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీసి వారికి చేయూతనందించి , అసలు తెలుగు భాషా , సంస్కృతిని మరిచి పోతున్న బాలలను దిద్ది తీర్చుతుంది విశాల. ఇలాంటి ఉపాధ్యాయిని కలిగి ఉండగలగడం నిజంగా ఆ విద్యార్ధుల అదృష్టమనే చెప్పాలి. బాలలోని సృజన కడలిని అలలు అలలుగా విస్తరింపజేస్తూ ,వివిధ సాహిత్య ప్రక్రియల్లో వారిచేత పాటలు, పద్యాలు , నాటికలూ ఇలా ఎన్నో ఓర్పుతో సహనంతో ఇష్టంగా చేయించే ,చేసే విశాల  మంచి అమ్మలాంటి తెలుగు అమ్మగారు.
ఇక తన సాహిత్య కృషి గురించి చెప్పాలంటే , ఎన్ని ఒత్తిళ్లలో ఉన్నప్పటికీ ఏ కాస్త సమయం దొరికినా ఆమె హాజరయ్యే సాహిత్య సభలు, చదువుకున్న సాహిత్యం, జీవితం నుండి అనుభవ సారాన్ని కథలుగా , కవితలుగా, పిల్లల పాటలుగా, రూపకాలుగా ఇలా తనవంతు సాహిత్య కృషి నిరంతరం మొక్కవోని సంకల్పం తో చేస్తుంది. ఆత్మీయనురాగాల వల్లి, అక్షరాల తల్లి ఉత్తరాంధ్ర అక్షర వనం లో మరో సాహితీమందారం మా విశాలాక్షికి ఇదే నా హృదయ పూర్వక ప్రేమాభినందనలు....ప్రేమతో జగద్ధాత్రి